ఇంగువ ఔషధ విలువలు
* ఇంగువ చాలా మందికి వంటల్లో వాడుకునే పదార్థాంగానే తెలుసు. అయితే దీనిలో ఔషధ విలువలు అనేకం ఉన్నాయి.
* దీనికి ఫెరులా ఫోటిడా అనే ల్యాటిన్ పేరు ఉంది. ఫోటిడా అంటే తీవ్రమైన వాసన కలిగినది అని అర్థం. మన దేశంలో కాశ్మీర్‌లో లభించే ఇంగువ పేరు ఫెరులా నార్తెక్స్. దీనిని ఇంగ్లీషులో ఆసాఫోటిడా అనీ, డెవిల్స్ డంగ్ అనీ అంటారు. సంస్కృతంలో హింగు అని పేరు.
* ఇంగువలో సల్ఫర్ యోగికాలు ఉంటాయి కనుక గాఢమైన వాసన వస్తుంటుంది. దీని వాసనలోని గాఢత ఉల్లిపాయ వాసనని మించి ఉంటుంది. దీనిని ఆహార పదార్థాల తయారీకి వాడుతుంటారు. అలాగే మసాలాల తయారీలో కూడా ఇది ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది.
* కాంథార్, ఆఫ్గనిస్తాన్, పర్షియా, ఇరాన్ వంటి దేశాలు దీనిని విశేష స్థాయిలో ఉత్పత్తిచేస్తాయి. అరేబియన్ వైద్యులు దీనికి విశేషమైన ప్రాచుర్యాన్ని కల్పించారు. మన దేశం విషయానికి వస్తే... కాశ్మీర్ ప్రాంతంలో ఇంగువ వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి.
* ఇంగువను ఆయుర్వేదంలో ఔషధంగా వాడతారు. చెట్టునుంచి సేకరించిన బంక లాంటి నిర్యాసానికి (ఓలియో గమ్ రెసిన్) ఔషధపు విలువుంటాయి. చెట్టు మిగతా భాగాల్లో అంతగా ఔషధపు విలువలు ఉండవు.
ఔషధోపయోగాలకోసం సాధారణంగా ఇంగువను 125-500 మి.గ్రా. మోతాదులో వాడతారు.
* ఇంగువను నేరుగా కాకుండా శుద్ధిచేసి వాడుకుంటే దానిలోని ఉగ్రత్వం తగ్గుతుంది. ఇనుప మూకుడులో నెయ్యి వేసి నిప్పుల మీద వేడి చేయాలి. తరువాత దీనిలో ఇంగువను వేసి దోరగా వేయించాలి. చల్లారిన తరువాత ఔషధ కల్పనకు ఉపయోగించాలి.
* హింగ్వాష్టక, హింగుత్రిగుణ తైలం, రజఃప్రవర్తవీవటి వంటి ఔషధాలు ఇంగువ ప్రధాన ద్రవ్యంగా తయారవుతాయి.
* ఇంగువను సేకరించే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంగువ చెట్టు చాలా పొడవుగా పెరుగుతుంది. దీనికి క్యారెట్ ఆకారాన్ని పోలిన వేర్లు ఉంటాయి. వేరు పైభాగంలో కత్తితో గాటుపెట్టి వదిలేస్తే నెమ్మదిగా నిర్యాసం సంచితమవుతుంది. ఇది గట్టిపడి పసుపుపచ్చని రంగు జిగురుగా మారుతుంది. దీనినే ‘ఇంగువ’ అంటారు. ఇలా సేకరించిన దానిని మట్టి మూకుడులోకి తీసుకొని తోలు సంచిలో ప్యాక్‌చేసి మార్కెట్‌కి తరలిస్తారు.
* ఇంగువ చాలా ఖరీదైనది కనుక సాధారణంగా కల్తీ కలుపుతుంటారు. తుమ్మజిగురు, బంగాళా దుంప ముక్కలు, ఇంగువ పట్ట కషాయంతో కలిపి ముద్దచేసి ఇంగువగా చెలామణి చేస్తుంటారు కనుక జాగ్రత్త పడాలి.
* అసలైన ఇంగువను గుర్తించడానికి కొన్ని పద్ధతులున్నాయి. ఉదాహరణకు అసలు సిసలైన ఇంగువను నీళ్లలో వేస్తే పూర్తిగా కరుగుతుంది. ఇంగువ కలిపిన నీళ్లన్నీ పాల మాదిరిగా తెల్లగా తయారవుతాయి. ఇంగువకు అగ్గిపుల్లతో గీసి మండిస్తే పూర్తిగా మండిపోతుంది.
* బ్రిటీష్ హెర్బల్ ఫార్మకోపియా, ప్రపంచ ఆరోగ్యసంస్థ విడుదల చేసిన మోనోగ్రాఫ్ ఫర్ హెర్బల్ మెడిసినల్ ప్లాంట్స్ వంటివి ఇంగువ ఔషధోపయోగాలను ప్రచురించాయి.
దీర్ఘకాలపు బ్రాంకైటిస్, ఉబ్బసం, కోరింత దగ్గు, గొంతు బొంగురు, హిస్టీరియా, ఫ్లాస్టులెంట్ కోలిక్, (గ్యాస్‌తో కూడిన ఉదరశూల), మూర్ఛలు, ఆంత్రక్రిమి, డిస్పెస్పియా, క్రానిక్ గ్యాస్టైటిస్, ఇరిటబుల్ కోలాన్ తదితర వ్యాధుల్లో ఇంగువ ఉపయోగపడుతుంది. బాహ్యంగా ఇంగువను ఆనెలు, చర్మకీలల్లో ప్రయోగించవచ్చునని ఈ మోనోగ్రాఫ్స్ సూచించాయి. కాగా ఇంగువను వాడకూడని సందర్భాలు సైతం ఉన్నాయి. శరీరాంతర్గత రక్తస్రావాలు, గర్భధారణ సమయంలో వాడకూడదు (అబార్షన్ రిస్కు ఉంటుంది), స్తన్యపాన సమయంలో తల్లి వాడకూడదు. పసిపిల్లల్లో వాడకూడదు (మెథిమో గ్లోబినీమియా రిస్కు ఉంటుంది). యాంటి కోగులెంట్స్, త్రాంబోలైటిక్స్ వాడుతున్నప్పుడు ఇంగువను వాడకూడదు (రక్తస్రావం రిస్కు పెరుగుతుంది). రక్తస్రావ వ్యాధుల్లో ఇంగువను వాడకూడదు. పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్ కారణంగా శోథ జనించినప్పుడు ఇంగువను వాడకూడదు. రక్త్భారం ఎక్కువ తక్కువల్లో ఇంగువను వైద్య సలహా లేకుండా వాడకూడదు.
ఆయుర్వేద గృహ చికిత్సలు
పిప్పి పన్ను
ఇంగువను కొద్దిగా వేయించి పిప్పి పన్ను మీద ఉంచితే నొప్పి తగ్గుతుంది.
బహిష్టు నొప్పి (మక్కలశూల)
ఇంగువను నేతిలో వేయించి తీసుకుంటే బహిష్టు నొప్పి తగ్గుతుంది.
మలేరియా జ్వరం
ఇంగువకు పాత నెయ్యి కలిపి గాఢంగా వాసన చూస్తే మలేరియాలో ఉపశమనం లభిస్తుంది.
ఇంగువకు సౌవర్చల లవణం కలిపి తీసుకుంటే కడుపునొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. శొంఠి కషాయానికి ఆముదం వేర్లు, బార్లి, పుష్కర మూలం, ఇంగువ కలిపి తీసుకున్న కడుపునొప్పి తగ్గుతుంది.
ఆకలి తగ్గటం (అగ్నిమాంద్యం)
ఇంగువ, త్రికటు (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు), వాము, జీలకర్ర, నల్ల జీలకర్ర, సైంధవ లవణం ఈ ఎనిమిదింటినీ సమానంగా తీసుకొని పొడిచేసి వేడి నీళ్లతో తీసుకోవాలి. దీనిని హింగ్వాష్టక చూర్ణం అంటారు.
ఉన్మాదం
నెయ్యిలో ఇంగువ, ఇంగువ ఆకులు, కరక్కాయ, బ్రాహ్మీలను వేసి వేడిచేసి తీసుకోవాలి.
మద్యపానంలో మత్తు దిగడానికి
సౌవర్చల లవణానికి ఇంగువ, మిరియాలు కలిపి పుల్లని మజ్జిగతో తీసుకుంటే మద్యపానం తరువాత వచ్చే మత్తు దిగుతుంది.
చెవి నొప్పి
ఆవ నూనెకు ఇంగువ, శొంఠి కలిపి వేడిచేసి చెవిలో వేసుకుంటే చెవి నొప్పిలో ఉపశమనం లభిస్తుంది. లేదా హింగ్వాది తైలాన్ని కూడా వాడవచ్చు.
ఉదరంలో పెరుగుదలలు (గుల్మం)
హింగ్వాది చూర్ణం, హింగ్వాది గుటిక, హింగుత్రిగుణ తైలం వంటివి వాడాలి.
జీర్ణ వ్యవస్థ వ్యాధులు
గ్యాస్‌ని వెలువరింపచేసే తత్వం ఇంగువకు ఉంటుంది. గ్యాస్ నుంచి ఉపశమనాన్ని కలిగించే ఓషధుల్లో ఇది ముఖ్యమైన ఓషధి. ఆహారం జీర్ణం కాకపోవటం, కడుపునొప్పి వంటి సమస్యల్లో ఇంగువను ఉపయోగించవచ్చు. పొట్ట ఉబ్బరించి గ్యాస్‌తో నిండిపోయినప్పుడు ఇంగువను బాహ్య ప్రయోగంగా వాడి ప్రయోజనం పొందవచ్చు. ముందుగా ఇంగువను వేడినీళ్లలో కరిగించాలి. ఒక గుడ్డను ఈ నీళ్లలో తడిపి ఉదర కండరాలపై పరిచి కాపడం పెట్టుకోవాలి. గ్యాస్ మరీ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటే ఇంగువ కలిపిన నీళ్లను ఎనిమా మాదిరిగా తీసుకోవచ్చు.
- డా. చిరుమామిళ్ల మురళీమనోహర్