గుంజీళ్లు తీయడం వెనుక ఉన్నఒక పురాణ కథ
విఘ్నేశ్వరునిది బాలుడి మనస్తత్వం. అటుకులు, బెల్లం, చెఱకు, గుంజీళ్ళు, కుడుములు వంటి చిన్న చిన్న విషయాలకు సంతోషపడిపోతుంటారు. వినాయకుని ఎదుట గుంజీళ్లు తీయాలని పెద్దలు చెప్తారు. ఎందుకంటే అలా గుంజీళ్లు తీయడం వలన స్వామికి సంతోషం కలుగుతుందట. అలా సంతోషంతో మనకోర్కెలను త్వరగా తీర్చుతారని ప్రతీతి. ఈ గుంజీళ్లు తీయడం వెనుక ఒక పురాణ కథ ఉన్నది.
ఒకనాడు శ్రీ మహావిష్ణువు మేనల్లుడైన గణపతికి అనేక బహుమతులు తీసుకువచ్చి ఇచ్చారట. అవన్నీ అల్లుడికి చూపిస్తూ తన సుదర్శన చక్రాన్ని ప్రక్కన పెట్టారట. విఘ్నేశ్వరుడు ఆ సుదర్శన చక్రాన్ని తొండంతో తీసుకుని చటుక్కున మ్రింగేశాడు. కాసేపటికి శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రం ఏదిరా అని అడిగితే ఇంకెక్కడిది నేను మ్రింగేశాను అని సెలవిచ్చారు స్వామి. మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఎలా బయటకు తీయాలా అని ఆలోచించి చివరకు చెవులు రెండు పట్టుకుని గుంజీళ్లు తీయడం మొదలు పెట్టారట. అదిచూసి గణపతికి ఆనందం వేసి బిగ్గరగా నవ్వడం మొదలు పెట్టారు. ఈనవ్వడంలో సుదర్శనచక్రం బయటకు వచ్చింది. అలా మొదట గణపతికి గుంజీళ్లు సమర్పించినది శ్రీమహావిష్ణువే!
వినాయకుని ముందు గుంజీళ్ళు తీయటం వెనుక ఉన్న ఆరోగ్య/ఆధ్యాత్మిక రహస్యం:
వినాయకుడు మన శరీరంలోని మూలాధార చక్రానికి అధిపతి... మన శరీరం మొత్తం మూలాధారచక్రంతోనే ముడి పడి ఉంది... ఇది సరిగ్గా మనం కూర్చున్నపుడు వెన్నెముక కు క్రిందిభాగంలో చివరగా ఉంటుందన్న మాట. గుంజీళ్ళు తీసేటపుడు ఈ చక్రం చైతన్యవంతమై మనలోని ఆధ్యాత్మిక పురోగతి వృద్ధి అవుతుంది...
గుంజీళ్ళు తీసేటపుడు మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోతెలుస్తుంది... సాధారణంగా మన నాసికం(ముక్కు)లోని రెండు రంధ్రాల నుండి ఒకేసారి గాలి పీల్చటం కానీ వదలటం కానీ చేయం.. ఏదో ఒక రంధ్రం మాత్రమే ఉపయోగిస్తాం.. కనీసం మనకు అవగాహన కూడా ఉండదు.. ఒకసారి కావాలంటే మీ నాసికరంధ్రాలదగ్గర చేతి వేలు ఉంచుకుని పరీక్షించండి.. ఇది మీకు అర్థం అవుతుంది..
అయితే ఈ గుంజీళ్ళు తీసిన తర్వాత నాసిక లోని రెండు రంధ్రాలు మన శ్వాసక్రియకు ఉపయోగపడడం మనం గమనించవచ్చు.. అందుకే గుంజీళ్ళు తీయడమనేది ఒకరకంగా ప్రాణాయామ శక్తిని పొందడానికి మరియు ఆధ్యాత్మిక ప్రగతిది దోహదంచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
No comments:
Post a Comment